
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల మందికి చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు కొడంగల్లో నిర్వహించే కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ఈ నెల 19వ తేదీ నుంచి నగదు పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి నెలా అందే పింఛను ద్వారా లబ్ధిదారులు తమ నిత్యావసరాలను తీర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. కొత్తగా ఎంపికైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛను సొమ్ము అందేలా సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కొడంగల్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాల పంపిణీ జరగనుండటంతో కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్