
అమరావతి , 08 నవంబర్ (హి.స.)
గుంటూరు జిల్లా రేటూరు గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి తరఫున విజయం సాధించిన ఎంపీటీసీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీగా వెళ్తుండగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు అడ్డుపడ్డారు. రోడ్డుపై కారును నిలిపి ర్యాలీ ముందుకు సాగకుండా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పి ఘర్షణ చోటుచేసుకుంది.
వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వల్లూరు సుధాకర్ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
మరోవైపు, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ విభేదాలు ఘర్షణలకు దారితీయకుండా సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్