
అమరావతి , 08 నవంబర్ (హి.స.)
ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి మినహాయింపు లభించింది. రాష్ట్రంలోని ఎన్నికలు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో సాధారణ పరిపాలనా కార్యకలాపాలు తిరిగి యథావిధిగా కొనసాగనున్నాయి.
ఎన్నికల సమయంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలు తొలగిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు సాధారణంగా తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలు అమల్లోనే ఉండనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలుపై ఈ విధంగా వేర్వేరు నిర్ణయాలు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్