
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పర్సాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబంలో ఆనందాన్ని నింపారు. శ్రీనివాస్-సుమిత్ర దంపతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని సీఎం స్వయంగా ప్రారంభించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని లబ్ధిదారుల ఇంట్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం అందించిన ఇంటిలో దీపావళి జరుపుకోవడం లబ్ధిదారుల కుటుంబానికి ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచింది. ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి పండుగలో పాల్గొనడంతో శ్రీనివాస్-సుమిత్ర దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా లబ్ధిదారుల ఇంట్లో దీపావళి జరుపుకోవడం ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా ఉంటుందనే సందేశాన్ని సీఎం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్