మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మవిశ్వాసంతో జీవించాలి: మంత్రి సీతక్క
ప్రతి మహిళ ఆర్థికంగా బలపడటంతో పాటు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని మంత్రి సీతక్క అన్నారు.
Seethaka


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

ప్రతి మహిళ ఆర్థికంగా బలపడటంతో పాటు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని మంత్రి సీతక్క అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె వివరించారు.

మహిళలు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గిందన్నారు.

మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే దిశగా తీసుకున్న చర్యలు వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని పేర్కొన్నారు.

అలాగే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తున్నామని సీతక్క వెల్లడించారు. మహిళలు పొదుపు, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande