
హైదరాబాద్, 08 నవంబర్ (హి.స.)
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కంజర్లలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి చేసుకోవడం, వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీయే పునాది వేశారని గుర్తుచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని వివేక్ విమర్శించారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి, అభివృద్ధి పనులు చేయకుండా బిల్లులు పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా పేదలందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టామని, మరో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని వెల్లడించారు.
అర్హులైన పేదలకు సామాజిక పింఛన్లు, సన్నబియ్యం ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతోందని అన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం కోసం సీఎం అల్పాహార పథకం తెచ్చారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..