
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
వాహనదారులకు ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రవాణా శాఖ పలు కీలక సేవలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ (e-KYC) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాహన యాజమాన్య బదిలీ (Vehicle Transfer), చిరునామా మార్పు, డూప్లికేట్ ఆర్సీ (RC) పొందే ప్రక్రియ సులభతరమైంది. దళారుల ప్రమేయాన్ని అరికట్టడం, ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం.
నూతన విధానం ప్రకారం వాహనదారులు తమ ఇంట్లో ఉండే పత్రాలను అప్లోడ్ చేసి, ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయవచ్చు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించిన వెంటనే డిజిటల్ సంతకంతో కూడిన పత్రాలు ఆన్లైన్లోనే మంజూరవుతాయి. గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణ వంటి సేవలను కూడా డిజిటల్ పరిధిలోకి తేనుండటంతో ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్