
హైదరాబాద్, 08 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. గోపనపల్లిలోని జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయి కనిపించారు. దంపతులు, వారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూడగా ముగ్గురూ అప్పటికే మృతి చెంది ఉన్నారు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో 2-3 రోజుల క్రితమే వారు చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
కుటుంబంలో వేధిస్తున్న తీవ్ర ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..