
శ్రీకాకుళం , 08 నవంబర్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నిమ్మాడలో పండుగ వాతావరణం కనిపించింది. విజయం సాధించిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు విజయం సాధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తల సేవలను ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చేసిన నిరంతర శ్రమకు ప్రజల ఆదరణ తోడవడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం ఎంతో విలువైనదని ఆయన అన్నారు.
ఎన్నికల్లో సాధించిన గెలుపుతో బాధ్యత మరింత పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు తమకు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్