అండాల అక్రమ సేకరణపై మహిళా కమిషన్ సుమోటో కేసు
తెలంగాణలో ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాల సేకరణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
TELANGANA police


హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాల సేకరణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలికితీసేందుకు ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది.

మహిళల నుంచి అండాలను సేకరించే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యపరమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించింది. నోటీసులు అందుకున్న ఐదు కేంద్రాల నిర్వాహకులు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటివరకు అండాల సేకరణకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేశారు.

అండాల సేకరణ ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఎంతమంది మహిళల నుంచి అండాలను సేకరించారు? ఇందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? వంటి అంశాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించింది. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధించిన పత్రాలు, రికార్డుల ఆధారంగా వివరాలను సేకరించింది.

మహిళల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande