
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్యకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీసీ జానయ్యపై ఓ మహిళా ప్రొఫెసర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కమిషన్ ఈ చర్య తీసుకుంది.
తనను జానయ్య లైంగికంగా వేధించారంటూ మహిళా ప్రొఫెసర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వీసీకి నోటీసులు పంపించింది.
ఈ నెల 12న జరిగే విచారణకు హాజరై ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదులోని అంశాలు, వాటికి సంబంధించిన వాస్తవాలను కమిషన్ పరిశీలించనుంది. ఈ విచారణలో జానయ్య ఇచ్చే వివరణతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యవహారం వ్యవసాయ విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్