
కామారెడ్డి , 09 నవంబర్ (హి.స.)
కామారెడ్డి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాంధారి మండలం గుడిమెట్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుడిమెట్ గ్రామ సమీపంలో ప్రయాణిస్తుండగా, అదే సమయంలో ఓ కారు బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన బస్సు డ్రైవర్ కారును ఢీకొనకుండా ఉండేందుకు బస్సును పక్కకు మళ్లించారు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి వెళ్లిపోయింది.
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రాణనష్టం జరగలేదని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై వాహనదారులు ఓవర్టేకింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్