
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)డంపింగ్ యార్డ్ నిర్మాణం విషయంలో రాజకీయాలు చేయకుండా అభివృద్ధి పనులకు సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. కొందరు నేతల స్వార్థ రాజకీయాల కారణంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం పనులను అడ్డుకోవడం సరికాదని, ఇలాంటి వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని బండి సంజయ్ విమర్శించారు. రాజకీయ వివాదాలతో కాంట్రాక్టర్ సైతం పనులు వదిలి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల కోసం యూసీఎఫ్ నుంచి రూ.80 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. అలాగే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.70 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఏడాదిలోగా రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోకుండా అందరూ సహకరించాలని బండి సంజయ్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్