
భద్రాద్రి కొత్తగూడెం, 09 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని
బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై సోమవారం ఉదయం కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆయన వివిధ విభాగాలను చూసి వైద్య సేవల తీరును సమీక్షించారు.
ల్యాబ్, ఓపీ విభాగాలను సందర్శించి, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులకు చేస్తున్న పరీక్షలు, ఇస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు.
ఆసుపత్రి పరిసరాల్లో ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలని, చికిత్సకు వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమయాల్లో రోగులకు ఇబ్బంది లేకుండా 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమయపాలన పాటిస్తూ, రికార్డులను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు