ఏపీలో వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా
ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ వేళ చోటుచేసుకున్న వరుస అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
Chandrababu Naidu


అమరావతి , 09 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ వేళ చోటుచేసుకున్న వరుస అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించి దుకాణాలు, వ్యాపార సంస్థలు అగ్నికి ఆహుతి కావడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూమ్లోని సామగ్రి దగ్ధమైంది. మరోవైపు గన్నవరంలో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా నుంచి ఎగసిపడిన నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తిరువూరులోనూ విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఓ దుకాణం అగ్నికి ఆహుతైంది.

ఈ మూడు ఘటనలపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి ప్రమాదాల తీవ్రత, జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ సమయంలో ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande