దీపావళి వేళ ప్రమాదాలు.. కంటి గాయాలతో ఆసుపత్రులకు క్యూ
దీపావళి సంబరాలు చాలా మందికి గాయాలతో ముగిసాయి
దీపావళి


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

దీపావళి సంబరాలు చాలా మందికి గాయాలతో ముగిసాయి. హైదరాబాద్ నగరంలో బాణసంచా కాల్చుతూ కళ్లకు దెబ్బలు తగిలిన వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు చేరుకున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఈ ప్రమాదాల బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నారు.

మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి కంటి గాయాలతో వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజా లెక్కల ప్రకారం ఒక్క ఈ ఆసుపత్రికే 32 మంది చికిత్స కోసం వచ్చారు. అందులో ఆరుగురిని అడ్మిట్ చేసుకోగా, వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారని వైద్యులు తెలిపారు. మిగిలిన 26 మందికి చికిత్స చేసి, మళ్లీ పరీక్షల కోసం రావాలని సూచించారు. ఈ బాధితుల్లో ఒక వ్యక్తి కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

దీపావళి సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించిన సరోజినీదేవి ఆసుపత్రి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 550 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో బాణసంచా బాధితుల కోసం ప్రత్యేకంగా 20 పడకలను సిద్ధంగా ఉంచారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసరంగా బాధితులను తీసుకురావడానికి అంబులెన్సులను కూడా రెడీగా పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande