నూతన టెక్నాలజీ పై విద్యుత్ సిబ్బందికి మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు టీజీఎస్పీడీసీఎల్ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.
Electricity


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు టీజీఎస్పీడీసీఎల్ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.

హైదరాబాద్లోని కళ్యాణ్ నగర్లో ఉన్న SCADA కేంద్రంలో సిబ్బందికి మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సీఎండీ జితేష్ వి. పాటిల్ సూచనలతో ప్రాజెక్ట్స్ & ఐటీ విభాగం ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది.

విద్యుత్ లైన్లను పరిశీలించడంలో డ్రోన్లు, AI టెక్నాలజీని ఎలా వాడాలో నేర్పించడమే దీని ఉద్దేశం.

మొదటి రోజు నవంబర్ 9న డ్రోన్లలో ఉండే రకాలు, DGCA నిబంధనలు, పైలట్ లైసెన్స్ తీసుకునే విధానం, డ్రోన్ను సురక్షితంగా నడపడం గురించి ప్రాథమిక విషయాలు చెప్పారు. రిమోట్ కంట్రోల్ వాడకం, నావిగేషన్ గురించి కూడా వివరించారు.

నవంబర్ 10న జరిగే రెండో రోజు శిక్షణలో డ్రోన్ విడిభాగాలు, బ్యాటరీలను జాగ్రత్తగా చూసుకోవడం, టేకాఫ్ - ల్యాండింగ్ చేయడం, గాల్లో డ్రోన్ను కంట్రోల్ చేయడం వంటివి ప్రాక్టికల్గా నేర్పిస్తారు. అత్యవసర పరిస్థితి వస్తే ఏం చేయాలో కూడా చెబుతారు.

చివరి రోజు నవంబర్ 11న కరెంట్ స్తంభాలు, టవర్లు, కండక్టర్లను గాల్లో నుంచి సర్వే చేసి చూపిస్తారు. అలా సేకరించిన డేటాను AI యాప్లతో పరిశీలించి లోపాలున్న చోట్లను ముందే గుర్తించి మ్యాప్ చేసే విధానాన్ని నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక సిబ్బందికి సర్టిఫికెట్లు ఇస్తారు.

ఈ కొత్త టెక్నాలజీతో లైన్లలో వచ్చే లోపాలను ముందే కనిపెట్టడం, ప్రమాదాలు జరగకుండా చూడడం, మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయడం సులభం అవుతుంది. దీనివల్ల వినియోగదారులకు మరింత మెరుగైన, నమ్మదగిన విద్యుత్ అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande