
అమరావతి , 09 నవంబర్ (హి.స.)
కృష్ణా జిల్లాలోని కోడూరు ప్రాంతంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోడూరులోని వంతెన కూడలి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సిలిండర్ పేలుడు శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల నివసించే వారు అప్రమత్తమయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. లేదంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి ఇంట్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొంతసేపు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో ఇంటికి సంబంధించిన వస్తువులు, ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సంబంధిత అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో కోడూరు వంతెన కూడలి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్