
మంచిర్యాల, 09 నవంబర్ (హి.స.)
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్పూర్లో సోమవారం రైతులు రోడ్డెక్కారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతగూడ సింగిల్ విండో వైస్ చైర్మన్ కమ్మల విజయధర్మ, మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి నేతృత్వంలో ఈ నిరసన సాగింది. పొట్టకు వచ్చిన వరి పైరుకు ఇప్పుడు నీరు చాలా అవసరమని, కానీ కాలువలో నీరు రాక పంటలు వాడిపోతున్నాయని రైతులు వాపోయారు. అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి వచ్చే దశలో నీళ్లు లేక నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయకట్టు చివరి వరకు వెంటనే నీరు చేరేలా చూడాలని, ఇకపై ఇలాంటి ఇబ్బంది రాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని, ఇంతకుముందు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..