ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి లక్ష్యం.. మంత్రి పొన్నం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ డ్రెయిన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శంకుస్థాపన చేశారు.
Minister


కరీంనగర్, 09 నవంబర్ (హి.స.)

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ డ్రెయిన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేయాలని అన్నారు.

వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

70 నుంచి 90 శాతం పనులు పూర్తయి వివిధ కారణాలతో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పొన్నం చెప్పారు.

ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాలతో పాటు ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్ను తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.

కరీంనగర్లో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బన్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నామని, పట్టణాభివృద్ధి కోసం దాదాపు వెయ్యి కొత్త పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్టు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande