
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)
జనన, మరణాల నమోదులో ఆలస్యం జరిగితే ఇకపై సంబంధిత అధికారుల నుంచి వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఆలస్యంగా వచ్చే జనన, మరణాల నమోదు దరఖాస్తులను జిల్లా మేజిస్ట్రేట్, ఆర్డీఓ లేదా తహసీల్దార్ పరిశీలించి నిర్ధారణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే నమోదు చేయాలని స్పష్టం చేసింది.
రెండేళ్లకు మించి ఆలస్యంగా సమాచారం అందించిన సందర్భాల్లో మాత్రం సంబంధిత ప్రాంతంపై అధికార పరిధి కలిగిన ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగానే నమోదు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను అనుసరిస్తూ జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్-13లో మార్పులు చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. అవసరమైన ప్రాంతాల్లో చట్టబద్ధంగా నియమించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు కూడా అధికారాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కొత్త నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్వేర్తో పాటు నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేయాలని సీసీఎల్ఏను ఆదేశించారు. తప్పుడు వివరాలతో ధ్రువపత్రాలు పొందకుండా పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్