
హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. చలి పెరుగుతున్న వేళ వర్ష సూచన రావడం గమనార్హం.
తెలంగాణలో ఇప్పటికే చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్యం నుంచి వస్తున్న పొడి గాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతోంది. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. సాయంత్రం 5:30 తర్వాత చల్లగాలులు ఎక్కువగా వీస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో చలి మరింత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది.
కొత్త అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచొచ్చు. తెలంగాణలోనూ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు