
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రెండో రోజు కార్యక్రమాలను సుందరకాండ పారాయణంతో ప్రారంభించారు. అహోబిలం జీయర్‌స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ముచ్చింతల్‌కు తరలివచ్చారు. స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారాయణ సమయంలో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. యతీంద్ర సప్తతి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ముచ్చింతల్ ప్రాంతం భక్తజన సందోహంతో సందడిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్