
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
మూసారాంబాగ్ మెట్రో స్టేషన్
పరిసరాల్లో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు మలక్పేట్ పోలీసులు నేడు చెక్ పెట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.2,50,000 విలువైన 12 ద్విచక్ర వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సిఆర్ No.010/2026, సెక్షన్ 303(2) బీఎన్ఎస్ కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 4న ఉదయం 10:45 గంటలకు మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ వద్ద పార్కు చేసిన (TS12-EL-3935) సైదాబాద్ నివాసి మొహమ్మద్ ఉమర్ షరీఫ్ గ్లామర్ బైక్ మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో జనవరి 7న మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు సేకరించి.. నిందితుల జాడను కనిపెట్టారు. ఫిబ్రవరి 23న మూసారాంబాగ్ మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో తమ్ము వీర వెంకట సత్యనారాయణ (32)ను అరెస్టు చేశారు.
ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో నిందితులపై కేసులు నమోదు..
పోలీసుల విచారణలో, అతడు రాపిడో రైడర్గా పనిచేస్తూ, విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి జూదానికి బానిసై డూప్లికేట్ తాళాలు ఉపయోగించి మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిపై మలక్పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో నిందితుడు సయ్యద్ అన్వర్ (33)కు సంబంధించి సెక్షన్ 35(3)బిఎన్ఎస్ఎస్ కింద నోటీసు జారీ చేశారు. నిందితుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మొత్తం 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే ప్రభాకర్ మార్గదర్శకత్వంలో, అదనపు డీసీపీ ఎండీ మజీద్ పర్యవేక్షణలో, మలక్పేట్ ఇన్స్పెక్టర్ పి. నరేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషనన్ను విజయవంతంగా పూర్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు