
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
అమాయకులను బోల్తా కొట్టించి వారి
కష్టార్జితాన్ని దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల ముఠాలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆపరేషన్ అక్టోపస్ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ను దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నిర్వహించారు. ప్రధాన సైబర్ నేరగాళ్ళకు బ్యాంకు ఖాతాలను ఇస్తున్న 104 మందిని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ 104 మందికి చెందిన 154 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలు మొత్తం దేశ వ్యాప్తంగా జరిగిన 1055 సైబర్ మోసాలకు సంబంధించిన కేసులతో లింక్ ఉందని దర్యాప్తులో తేలింది. వీటిలో రూ.127 కోట్ల లావాదేవీలు జరిగి వాటిని విదేశాల్లో ఉన్న ప్రధాన సైబర్ నేరగాళ్ళకు చేరవేశారని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నిందుతుల నుంచి రూ.36 లక్షల నగదు, 200 మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్ బుక్లు, 234 డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషనన్ను స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ విజయ్ కుమార్, సీసీఎస్ డీసీపీ అరవింద్ సారధ్యంలో ప్రత్యేక టీంలు 16 రాష్ట్రాల్లో జల్లెడ పట్టాయి. సైబర్ నేరగాళ్ళకు సహకరిస్తున్న బంధన్ బ్యాంకుకు చెందిన ఓ మేనేజర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల్లో బ్యాంకు అధికారులు:
కంచే చేను మేసింది అన్న చందంగా సైబర్ నేరాలను అడ్డుకోవడంలో కస్టమర్లకు సహకారం అందించాల్సిన బ్యాంకు ఉద్యోగులే అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతూ ఈ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు రోజు రోజుకు సైబర్ నేరాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము ఏ క్షణంలో కేటుగాళ్ల వశం అవుతాయో తెలియని ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు కష్టమర్లు, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించడమో లేదా వారికి సహాయపడటమే చేయాల్సిన బ్యాంకు ఉద్యోగులే ఇలా సైబర్ నేరగాళ్లతో చేతులులు కలిపితే ఇక తమకు దిక్కెవరూ అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు