
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
హైదరాబాద్ నగరంలోని చంద్రాయణగుట్ట పరిధిలోని బార్కాస్ ప్రాంతంలో ఉన్న శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరం పై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల భక్తులలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు విగ్రహం ధ్వంసమైన దృశ్యాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఆలయానికి చేరుకుని ఘటనను తీవ్రంగా ఖండించారు.
దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆలయాల భద్రత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల గుర్తింపునకు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో బార్కాస్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి శాంతి భద్రతలను పరిరక్షించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సహనంతో వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..