
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్
రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేస్తూ కొత్త అంశాలను చేర్చింది. న్యాయ వ్యవస్థ అనే అధ్యాయంలో 'న్యాయ వ్యవస్థలో అవినీతి' (Corruption in Judiciary) అనే అంశాన్ని తొలిసారిగా పరిచయం చేసింది. విద్యార్థులకు దేశంలోని న్యాయ వ్యవస్థ పనితీరు పై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు, అందులో ఉన్న సవాళ్లు, లోపాలను కూడా వివరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త పాఠ్యాంశంలో కేవలం అవినీతి గురించే కాకుండా, భారత న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కోర్టుల్లో పేరుకుపోయిన మిలియన్ల కొద్దీ కేసులు, విచారణలో జరుగుతున్న జాప్యం వంటి అంశాలను చేర్చారు. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే (Justice delayed is justice denied) అనే నినాదాన్ని విద్యార్థులకు వివరిస్తూ, న్యాయవ్యవస్థను సంస్కరించాల్సిన అవసరాన్ని పాఠ్యపుస్తకంలో చర్చించారు.
అయితే, ఈ మార్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియజేయడం మంచిదేనని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతుండగా, చిన్న వయసులోనే న్యాయవ్యవస్థపై ప్రతికూల భావన కలిగే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రాజకీయ ఉద్దేశాలతో మార్పులు చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో, NCERT తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..