ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)

ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీ.ఎస్ రామకృష్ణారావు సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా నుంచి పరీక్షా కేంద్రాలకు అవి చేరేవరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్ కొరత లేకుండా, విద్యార్థులకు తగిన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

144 పరీక్షా కేంద్రాలు

ఈసందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ దృష్టికి తెచ్చారు. ఈ నెల (ఫిబ్రవరి) 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మొత్తం 36,963 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 24,542 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారని, 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande