
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవీ
అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిని డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో పని చేస్తున్నారని చెప్పారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి(Maoist Ganapathi) ప్రస్తుతం అడవుల్లో లేరని మాకున్న సమచారం అని చెప్పారు. ఆయన బయట ఎక్కడో షెల్టర్ తీసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇక పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ ప్రస్తుతం జార్ఖండ్లో మావోయిస్టు పార్టీ టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఇన్చార్జీగా ఉన్నారని, ముక్కిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్, శేఖర్ అలియాస్ మంగు, జోడి రత్నాబాయ్ అలియాస్ సుజాత(గణపతి భార్య), నక్క సుశీల అలియాస్ రేలా, అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, కాశిపోగు భవాణి అలియాస్ సుగుణ, కుజం ఇరవల్ ఈ 11 మంది త్వరగా అజ్ఞాతం వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు