
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బడ్జెట్ సమావేశాల తర్వాతే నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం మరోసారి ప్రయత్నించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించింది. సచివాలయంలో రేవంత్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. పరిషత్ ఎన్నికలపైనా చర్చించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్ట పరంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో పోరాట కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై విపక్షాల అభిప్రాయాలనూ తీసుకొని కార్యాచరణ నిర్ణయించాలని మంత్రివర్గం తీర్మానించింది. *అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై, కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది . ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు