
డిల్లీ, 24 ఫిబ్రవరి (హి.స.)
భారత దేశంలో గత కొద్ది రోజులుగా
విభిన్నమైన వాతావరణం(different atmosphere) కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉదయం వేళ చలి, దట్టమైన పొగమంచు ప్రభావం చూపుతుండగా, దక్షిణాది, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ-NCR ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు 'యెల్లో అలర్ట్' జారీ చేశారు. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 16°C గా నమోదయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్లో వాతావరణం పొడిగానే ఉండనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 22°C నుండి 31°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా... చిరు జల్లులు, మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉంటే కర్ణాటక, బెంగళూరులో వేడితో కూడిన వాతావరణం ఉండనుండగా.. సాయంత్రం వేళ అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని IMD అంచనా వేసింది.
మరోవైపు, చెన్నైలో తేమతో కూడిన వేడి వాతావరణం కొనసాగుతుండగా, అప్పుడప్పుడు జల్లులు కురిసే అవకాశం ఉంది. ముంబైలో ఉష్ణోగ్రతలు 28°C వరకు నమోదవుతూ పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉదయం చలిగాను, మధ్యాహ్నం వేడిగాను ఉండే విలక్షణ వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షారు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి అల్ప పీడనం బలహీన పడనుండగా.. రాత్రి సమయంలో మేఘాలు విస్తరించి అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు