
వరంగల్, 25 ఫిబ్రవరి (హి.స.)
వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదుల ప్రాజెక్టు రాష్ట్ర రాజకీయాలకు వేదికగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయగా ఏకంగా సీఎం బడ్జెట్ సమావేశాల్లోనే చర్చిస్తామని ప్రకటించారు. గోదావరి జలాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి పుట్టిస్తుండగా బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు తో పాటు గోదావరిపై ఉన్న ఇతర ప్రాజెక్టులు రెండు పార్టీల ప్రజాప్రతినిధులు, నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా మారాయి. ఈ ప్రాజెక్టుపై చర్చరావడంతో ఉమ్మడి జిల్లా వాతావరణం వేడెక్కుతోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని దేవాదుల ప్రాజెక్టును 2001లో మొదలు పెట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 6వేల కోట్లతో మొదలు పెట్టగా ప్రస్తుతం రూ.14,500 కోట్లకు చేరింది. ఇప్పటికీ 80 శాతం పనులే పూర్తయ్యాయి. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు తుపాకులగూడెం వద్ద లిఫ్ట్ ను నిర్మించారు. సమ్మక్క బ్యారేజీగా తర్వాత పేరు మార్చినా ఇప్పటికీ మరిన్ని నిధులు ఇస్తేతప్ప పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రాజెక్టు మొదలు పెట్టి 25 ఏళ్లు అవుతుండగా రాజకీయ వివాదాలు మాత్రం తగ్గడం లేదు. టీటీడీ హయాంలో మొదలు పెట్టి కాంగ్రెస్ హయాంలో కొంతమేర పనులు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎ ఎస్ హయాంలో రీడిజైన్ చేసి పనులు మొదలు పెట్టారు. దేవాదుల ద్వారా స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, జనగామ నియోజకవర్గాల్లో సాగు నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.18 వేల 500 కోట్లకు
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టుపై పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతుండగా ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన నిధులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత వారంలో ఈ ప్రాజెక్టులోని దేవన్నపేట పంప్ హౌజ్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా ఎత్తిపోయడం లేదని ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని కోరారు. హరీష్ రావు వచ్చి వెళ్లిన తర్వాత రాజకీయ వేడి సంతరించుకుంది. ప్రాజెక్టుపైన వస్తున్న విమర్శలను తగ్గించడంతో పాటు పనులు వేగవంతం అయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చేయడంతో పాటు వెంటనే అవసరమైన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు ఇచ్చారు.
రెండేళ్లలోపు ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. గోదావరి జలాలపై పూర్తిస్థాయి చర్చను బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. సిర్పూర్ వద్ద ఉన్న ప్రాణహిత తుమ్మిడి హెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రాజెక్టులన్నిటిపైన చర్చిస్తామని సీఎం ప్రకటించారు. పూర్తిస్థాయిలో చర్చకు తెరలేపారు. ప్రాజెక్టు కు అవసరమైన నిధులు అన్ని ఇస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి నిధులు విడుదల చేస్తామన్నారు. గోదావరి పై నిర్మాణంలో ఉన్న అన్నింటిని పూర్తిచేస్తామన్నారు. హరీష్రరావు ఆరోపణలు.. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆ సవాళ్లను స్వీకరించడంతో పాటు బడ్జెట్ లో పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధమేనని ఎమ్మెల్యే హరీష్ రావు వరంగల్ పర్యటనలో మంగళవారం ప్రకటించారు. గోదావరి జలాలపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధం అన్నారు. ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు గోదావరి జలాలను దేవాదులను కేంద్రంగా చేసుకొని చర్చకు సిద్ధమవుతుండటంతో ప్రాజెక్టులపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతుంది. గత శాసనసభసమావేశాల్లో కృష్ణ ప్రాజెక్టులు, మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చ జరుగగా ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదుల ప్రాజెక్టు అసెంబ్లీ సమావేశాలకు చర్చా వేదికగా మారింది. బడ్జెట్ సమావేశాల్లో గోదావరి పై చేపట్టిన ప్రాజెక్టులపై కూడా చర్చ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు