అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్.. ప్రభుత్వం చర్యలు
రంగారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.) ''బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలగానే మిగిలిపోయిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ను కార్యరూపంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలన
Fruit market


రంగారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.)

'బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలగానే మిగిలిపోయిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ను కార్యరూపంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం తలపోస్తోంది. గతంలో రూపొందించిన డిజైన్ ప్రకారం రూ.3వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అయితే ప్రభుత్వం స్థల మార్పు చేసింది. ఓఆర్ఆర్ పక్కనే 239 ఎకరాల్లో నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకు కేబినేట్ ఆమోదం కూడా తెలిపింది. స్థల మార్పుతో ఇప్పటి వరకు తయారు చేసిన ఎస్టిమేషన్లు, డిపిఆర్ లలో కూడా మార్పులు చేయనున్నారు.. అందుకు అనుగుణంగా అంచనాలు రూపొందించి టెండర్లను పిలవనున్నారు. ఈ ప్రక్రియలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మార్కెట్ నిర్మాణానికి వీలైనంత త్వరలో శంకు స్థాపన జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గడ్డి అన్నారంలోని పండ్ల మార్కెట్ను అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరలించింది. ఓఆర్ఆర్కు పక్కనే అతిపెద్ద పండ్ల మార్కెట్ను ఏర్పాటుచేయాలని సంకల్పించి మూడేళ్ల క్రితం కోహెడలో తాత్కాలికంగా మార్కెట్ను ఏర్పాటు చేశారు. అయితే గాలి దుమారానికి రేకుల షెడ్లన్నీ గాలి దుమారానికి కూలిపోయాయి. దీంతో మార్కెట్ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పండ్ల మార్కెట్ను కోహెడ్కు చేరువలోనే ఉన్న బాట సింగారంలోని హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్కు తరలించారు. 2001 అక్టోబరు నుంచి

బాటసింగారంలోనే పండ్ల మార్కెట్ కొనసాగుతోంది. నిత్యం ఇక్కడి మార్కెట్కు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. రంజాన్ మాసంలో ముంబయి నుంచి ఖర్జూర భారీగా ఇక్కడకు దిగుమతి అవుతుంది. వేసవిలో రికార్డు స్థాయిలో మామిడి పంట్ల విక్రయాలు జరుగుతాయి.

దేశ, విదేశాలకు ఇక్కడి నుంచే పండ్ల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ప్రతి యేటా ఇక్కడి పండ్ల మార్కెట్లో రూ.1500కోట్ల టర్నోవర్ జరుగుతోంది. ఇక్కడి మార్కెట్టులో 306 మంది లైసెన్స్ డ్ కమీషన్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. మార్కెట్ నిర్వహణ కోసం హెచ్ఎండీఏతోపాటు ప్రైవేటు వ్యక్తలకు సంబంధించిన స్థలాలను అద్దెకు తీసుకున్నారు. ప్రతి నెలా అద్దె రూపంలో స్థలాల యజమానులకు రూ.66లక్షల వరకు చెల్లిస్తున్నారు. 2021 అక్టోబరు నుంచి ఇప్పటివరకు రూ.24కోట్ల అద్దె చెల్లించడంతో మార్కెట్ కు వచ్చే ఆదాయం అంతా అద్దెలకే సరిపోతోంది. మరోపక్క కోహెడలో మార్కెట్ నిర్మాణం కోసం 65 మార్కెట్ కమిటీల నుంచి రుణ రూపంలో తీసుకున్న రూ.314కోట్లు ఖాతాలో మూలుగుతున్నాయి. శాశ్వత ప్రాతిపాదికన కోహెడలో మార్కెట్ను ఏర్పాటు చేస్తే మార్కెట్కు పెద్ద ఎత్తున మిగులుబాటు కలిగే అవకాశం ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయ లేదు. కలగా మారిన మార్కెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేయబోతున్నది.సకల హంగులతో సమీకృత మార్కెట్..

గత ప్రభుత్వ హయాంలోనే డిజైన్లు రూపొందగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎస్టిమేషన్లతోపాటు డిజైన్లలో మార్పులు చేపట్టింది. రెండు వందల ఎకరాల్లో పండ్ల మార్కెట్ కోసం రూపొందించిన గత ప్రణాళికలోనూ మార్పులు చేశారు. పండ్లతోపాటు పాలు, మాంసం క్రయ విక్రయాలు జరిగేలా సమీకృత మార్కెట్ నిర్మాణానికి డిజైన్లను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హర్యానా రాష్ట్రంలోని గనౌర్ లో 545 ఎకరాల్లో రూ.6వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం అవుతున్న పండ్ల మార్కెట్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం పరిశీలించింది. ఆ తరహాలోనే ఇక్కడ మార్కెట్ కు కార్యరూపం ఇవ్వనున్నారు. షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు, పండ్ల ఎగుమతులకు ఎక్స్ పోర్టు జోన్ తదితర వాటిని సకల హంగులతో నిర్మించనున్నారు. రహదారులు, వాహనాల పార్కింగ్ తదితర సదుపాయాలకు డిజైన్ చేస్తున్నారు. అతి పెద్ద ఐకాన్, దానిపై ఉండే హెలిప్యాడ్ నిర్మాణం మార్కెట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. గతంలో అనుకున్న స్థలంలో కాకుండా ఓఆర్ఆర్ పక్కనే ఉన్న సర్వే నెం.167లో మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విస్తీర్ణం పెరగడంతో అందుకనుగుణంగా ఎస్టిమేషన్లు, డిపిఆర్ లలో మార్పులు చేపట్టనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande