
తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) జీహెచ్ఎంసీ పరిధిలో సొంత జాగలున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహనిర్మాణ సాయం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఎంపిక ప్రక్రియను చేపట్టగా.. ఉగాదిలోపు ఇక్కడి లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అర్హుల జాబితాను ఖరారు చేసి మంజూరు పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయనున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనూ ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక స్థాయిలో ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాయి. సొంత జాగాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేద కుటుంబాలకు ఈ విడతలో ఇళ్లు అందించనున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం వలన పట్టణాల్లో భూమి ఉన్నా నిర్మాణ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సర్కారీ సాయం ఊరటగా నిలువనుంది. ఆదాయ పరిమితి, కుటుంబ పరిస్థితులు, భూ యాజమాన్య పత్రాలు వంటి అంశాల ఆధారంగా అర్హతను నిర్ధారిస్తున్నారు. మొత్తంగా సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు సుమారు 18 వేల మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. ఈ అప్లికేషన్లను అధికారులు రీ వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆదేశించారు. కాగా, ఈ వెరిఫికేషన్ బాధ్యత మూడు కమిషనరేట్ల ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్లు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనకు ఆదేశాలు అందాయి.
మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణాలకు స్థలాల సేకరణ ప్రక్రియపై ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో చర్చించారు. హైదరాబాద్ లోని లబ్దిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించనున్నారు. సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్నవారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరో 28 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వనున్నారు. ఇక నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. 2.50 లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి లక్ష ఇండ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష గృహ ప్రవేశాలు చేయాలనే టార్గెట్తో ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాల్లో సైతం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పీఎం ఆవాస్ స్కీమ్ కేంద్రం ఇప్పటికే లక్షా 13 వేల ఇండ్లను మంజూరు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు