తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. టీ-ఫైబర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని టీ-ఫైబర్ సంకల్పించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగానూ ఇప్పటికే కేబుల్ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ అందుబాటులోక
Internet


తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.)

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని టీ-ఫైబర్ సంకల్పించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగానూ ఇప్పటికే కేబుల్ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే.. కేంద్రం నుంచి టీ-ఫైబర్కు ఓ గుడ్స్యూస్ వచ్చింది. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలందించేందుకు టీ-ఫైబర్ చేస్తున్న ప్రయత్నానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. భారత ప్రభుత్వం సవరించిన భారత్నెట్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద తెలంగాణకు రూ.3,185 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

ఈ నిధులతో భారత్నెట్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను అప్గ్రేడ్ చేయడంతోపాటు ఫేజ్-3 విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం, రాష్ట్రం మధ్య ఒప్పందం కుదుర్చు కోవాల్సి ఉన్నది. మరికొద్ది రోజుల్లో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిసింది. దాంతో ఓ రూట్ మ్యాప్ రూపొందించి.. ఆ తర్వాత కేంద్రం వాటా, రాష్ట్ర వాటాను విభజించి ఒప్పందం చేసుకోనున్నారు. ఆ తదుపరి వెంటనే ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. ఆ తర్వాత కేంద్రం వాటాతో రాష్ట్రం ముందుకెళ్లనుంది.

టీ-ఫైబర్ సేవలను ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 3,089 గ్రామాలకూ విస్తరించనున్నారు. ప్రస్తుతం టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలో 9,662 గ్రామాలకు సేవలు అందించే సామర్థ్యం ఉన్నది. కొత్త గ్రామాలు చేరడంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే దిశగా తెలంగాణ మరో అడుగు ముందుకేస్తుంది. మొత్తం రూ.3,185 కోట్లలో రూ.2,697 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్ పనులు, నిర్వహణ కోసం వినియోగించనున్నారు.

మరో రూ.432 కోట్లు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కేబుల్ మౌలిక వసతుల బలోపేతానికి కేటాయించనున్నారు. భారత్నెట్ ఫేజ్-2లో ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా సుమారు 42 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 9,662 గ్రామాల్లో వేశారు. వీటిలో 8,835 గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే సేవలు ప్రారంభం కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande