
కరీంనగర్, 25 ఫిబ్రవరి (హి.స.)
ఇటీవల జరిగిన మున్సిపల్
ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయారని నిలదీసినట్లు సమాచారం. కరీంనగర్ లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నిస్తూ.. ఈ విషయంలో అందరి ఫెయిల్యూర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈనెల 20న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తూ.. కరీంనగర్ కార్పొరేషన్లో పార్టీ ఓటమిపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కానీ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఓటమిని చవిచూసింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకున్నది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ మీటింగ్లో సీరియస్గా స్పందించినట్లు తెలిసింది. ప్రధానంగా ఖర్గే, వేణుగోపాల్.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి విషయంలో మాట్లాడుతూ 'ఎందుకు కరీంనగర్లో ఓడిపోయాం? అక్కడ గెలిచేందుకు ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టలేదు? మీ తప్పిదాల వల్లే అక్కడ ఓడిపోయాం. మన పార్టీపై
బీజేపీ సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నది. మంత్రులు ఎందుకు స్పందిచడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? బీజేపీ విషయంలో ఆశించిన స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు. ఇప్పటి నుంచి వైఖరి మార్చుకోండి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై అటాక్ చేయండి' అని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
రాహుల్ చెప్పిందే నిజమైందని కామెంట్
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనే అంశం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైందని, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని , వేణుగోపాల్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ చాలా కాలం క్రితమే 'బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ఎస్.' అని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహాన్ని ప్రజలకు అర్ధమయ్యే విధంగా వివరించాలని హితబోధ చేసినట్లు తెలిసింది. ఇప్పటి నుంచి ప్రతి సందర్భంలో ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని పార్టీ ప్రోగ్రామ్స్ తయారు చేయాలని సూచించినట్లు సమాచారం.
చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో లోక్సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన మంత్రుల సమావేశంలో ఏఐసీసీ నేతలు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మార్చి 9 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతామని వివరించినట్లు తెలిసింది. బిల్లుపై చర్చించేందుకు స్పీకర్ ఆమోదించినా, తిరస్కరించినా.. బీజేపీ అసలు రంగు బయటపడుతుందని ఏఐసీసీ నేతలు కామెంట్ చేసినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు