ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీకి ఫ్రీ మైలేజ్.
ఆదిలాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీకి ఫ్రీ మైలేజ్ వస్తున్నది. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన రాజకీయ వివాదం క్రమంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నది. దీనికి కారణం మంత్రి వివేక్ సెంటర్ పాయింట్గా మా
Adilabad politics


ఆదిలాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో

కారు పార్టీకి ఫ్రీ మైలేజ్ వస్తున్నది. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన రాజకీయ వివాదం క్రమంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నది. దీనికి కారణం మంత్రి వివేక్ సెంటర్ పాయింట్గా మారినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారింది. ఒక్క మున్సిపల్ చైర్మెన్ పదవి మాటేమో గానీ గులాబీ పార్టీకి విపరీతంగా సానుభూతి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అసలు రాజకీయ గొడవకు దారి తీసింది. అక్కడ బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు ఏకమయ్యాయి. 24 కౌన్సిలర్ స్థానాలకు గాను 10చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులు, నలుగురు కమ్యూనిస్టు పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ పదవికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఆ రెండు పార్టీలు సాధించాయి. అయితే ఈ మున్సిపాలిటీ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోకి వస్తుండడంతో ఎలాగైనా ఆ పురపాలక సంఘంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి వివేక్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే సంఖ్యా బలం లేకపోవడంతో ఎలాగైనా ఇద్దరు కౌన్సిలర్లను తమ వర్గంలోకి తెచ్చుకొని ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలన్న వ్యూహం బెడిసి కొట్టింది. ఎన్నికల రోజు వివాదం ముదరడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఒకటిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక సమయంలో మంత్రి వివేక్ కారుపై దాడి జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ప్రస్తుతం బాల్క సుమన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అరెస్టు బాల్క సుమన్ అరెస్టు తర్వాత పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ ఇస్తున్నాయి. సుమన్ పర్యవసానం చెన్నూరు నియోజకవర్గంతోపాటు తూర్పు జిల్లాలో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తల్లో ఎక్కడలేని ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పార్టీ సీనియర్ నేతలు ఆదిలాబాద్ జిల్లా జైలుకు క్యూ కట్టడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీకి మైలేజ్ వస్తున్నది. రోజుకు ఒక ముఖ్యనేత వస్తుండడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతున్నది. మంత్రి వివేక్ పట్టుదలతో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అవుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం వెళ్లినట్లు చెబుతున్నారు. తాజాగా, జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి వివేక్తో ఈ విషయం చర్చించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చిన్న విషయాన్ని పెద్దగా చేయడం వల్ల నష్టమే గాని పార్టీకి పెద్దగా లాభం చేకూరే పరిస్థితి లేదన్నట్లు సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande