“ఎగిసి“పడిన చోటే ముగింపు దశకు సాయుధ ఉద్యమం..
తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ నక్సలైట్ ఉద్యమానికీ ఆలంబనగా నిలిచింది. సాయుధ పోరాటం నుంచే విప్లవ లక్షణాలు పుణికిపుచ్చుకున్న తెలంగాణ సమాజం చారు మజుందార్ స్థాపించిన తిరుగుబాటు పార్టీ సీపీఐ(ఎంఎల్)ను అన్నలు అంటూ సహజంగానే ఆహ్వాని
నక్సలైట్ ఉద్యమం


తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ నక్సలైట్ ఉద్యమానికీ ఆలంబనగా నిలిచింది. సాయుధ పోరాటం నుంచే విప్లవ లక్షణాలు పుణికిపుచ్చుకున్న తెలంగాణ సమాజం చారు మజుందార్ స్థాపించిన తిరుగుబాటు పార్టీ సీపీఐ(ఎంఎల్)ను అన్నలు అంటూ సహజంగానే ఆహ్వానించింది. అసమానతలు, అణచివేతలను ధిక్కరించి జగిత్యాల జైత్ర యాత్రకు దండు కట్టింది. ఆ జగిత్యాల రైతు కూలీ సభ అజ్ఞాత పార్టీ(?) కొత్త జవసత్వాలను అందించింది. 1967లో పశ్చిమ బెంగాల్ నక్సల్బరీ గ్రామంలో నక్సలైట్ ఉద్యమం పురుడుపోసుకున్నా.. తర్వాత శ్రీకాకుళానికి మేఘాలు కదలివచ్చినా బలమైన పునాదులను మాత్రం తెలంగాణే అందించింది.

పీపుల్స్ వార్ గ్రూప్ బలపడింది.. అది బలమైన మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి విశాల పోరాటాలు చేయడానికి తెలంగాణ గడ్డే భూమికగా నిలిచింది. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీకి నాయకత్వాన్నీ అందించింది. ఇప్పుడు అదే మావోయిస్టు పార్టీ చివరి మజిలీకి తెలంగాణే వేదికగా మారింది. అందుకే తెలంగాణకు మావోయిస్టు ఉద్యమానికి విడదీయరాని సంబంధమున్నదని విశ్లేషకుల అభిప్రాయం.

వర్గ శత్రువు నిర్మూలనే లక్ష్యంగా 1969లో చారు మజుందార్ స్థాపించిన సీపీఐ (ఎంఎల్) పార్టీ బెంగాల్ మీదుగా శ్రీకాకుళానికి.. అక్కడి నుంచి తెలంగాణకు అంది వచ్చింది. మిగిలిన చోట్ల కంటే తెలంగాణలో ఈ ఉద్యమానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఇక్కడి ప్రజలు ఆ తిరుగుబాటు రూపాన్ని అత్యంత వేగంగా సొంతం చేసుకున్నారు. వ్యూహకర్తలు, నాయకత్వాన్ని తెలంగాణే అందించింది. 1978లో నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర తెలంగాణను ఒక కుదుపు కుదిపింది. మారుమూల గ్రామాల నుంచి కాలినడకన, ఎడ్లబండ్లు.. ఇతరత్రాలపై సద్దికట్టుకునీ మరీ సాధారణ ప్రజలు తరలివచ్చారు.

ఇక్కడ నిర్వహించిన సభలో ముప్పాల లక్ష్మణరావు, శీలం నరేశ్, లలిత, కిషనీ, మల్లా రాజిరెడ్డి, సాహు, వరవరరావు, గద్దర్ సహా ఎందరో మహామహులు పాల్గొని వారి ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ మీటింగ్ ఎంత సక్సెస్ అయిందంటే నేడు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవీ పైనా దాని ప్రభావమున్నది. ఆర్ఆసీ, కేయూ, ఓయూ వంటి విద్యాసంస్థల నుంచి విద్యార్థులు అప్పటి ఉద్యమ వాతావరణంతో ప్రభావితులయ్యారు. కొండపల్లి సీతారామయ్య ఇచ్చిన 'గ్రామాలకు తరలండి' పిలుపుతో గ్రామీణ సమాజానికి పోరాట ప్రకంపనలు తాకాయి. అప్పటి తీవ్ర అసమానతలతో అల్లాడిన ప్రజలు అన్నలను అక్కున చేర్చుకున్నారు. తిరుగుబాటు లక్షణాలను ఈ ఉద్యమం ప్రోది చేయగా.. తెలంగాణోద్యమానికీ అవి దోహదపడ్డాయి.

1972లో మజుందార్ మరణం తర్వాత సీపీఐ(ఎంఎల్) పార్టీ ముక్కలై.. మళ్లీ కలవడానికి సీవోసీ ఏర్పడింది. సీవోసీ నుంచి వేరుపడి కొండపల్లి సీతారామయ్య సారథ్యంలో ఏర్పడిన పీపుల్స్ వార్.. అన్నింటిలోకెల్లా పవర్ఫుల్ గ్రూప్. కేఎస్ నేతృత్వంలో పటిష్టమైన మిలిటరీ శక్తిగా పరిణమించి దండకారణ్యానికి వ్యాపించింది. ఆ తర్వాత ముప్పాళ్ల లక్ష్మణరావు సారథ్యంలో దేశవ్యాప్త సాయుధ గ్రూపులు ఒకే పార్టీ(సీపీఐ(మావోయిస్టు)) కిందికి వచ్చాయి. అలా.. బెంగాల్లో పుట్టినప్పటికీ.. తెలంగాణలో వేళ్లూనుకుని దేశవ్యాప్తంగా మహావృక్షమై ఎదిగింది.

ముప్పాళ్ల లక్ష్మణరావు(గణపతి), మల్లోజుల వరంగల్ ఎన్ఐటీలో కోటేశ్వరరావు(కిషన్), చదువుకున్న నంబళ్ల కేశవరావు, మల్లోజు వేణుగోపాల్(సోనుదాదా), మల్లారెడ్డి, దేవ్, కడారి సత్యనారాయణరెడ్డి, కటకం సుదర్శన్, పటేల్ సుధాకర్, హరిభూషణ్ సహా పలువురు కీలక నాయకులను తెలంగాణ అందించింది. నేడు తెలంగాణకు చెందిన అగ్రనేతల తిప్పిరి తిరుపతి(దేవీ), మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిల లొంగుబాటుతో పార్టీ చివరి మజిలీకి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి నాయకత్వమే లేకుండా పోయిందని, తెలంగాణ నుంచి ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉంటే అందులో ఒక్కరే క్రియాశీలకంగా ఉన్నట్టు డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande