
అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మార్చి ఒకటో తేదీన ఆదివారం అవుతోంది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన అంటే శనివారం పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ఆరోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే ఈనెల 28వ తేదీన పెన్షన్లు అందుకొని వారికి, మార్చి రెండవ తేదీన కూడా ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు శ్రీకాకుళంలోని డయేరియా అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య తలెత్తకుండా మంచి నీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. తాగే నీరు కాలుష్యం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వెల్లడించారు. మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. డయేరియా పై ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV