
ఢిల్లీ,26ఫిబ్రవరి (హి.స.) జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు (Chief Justice Slams NCERT). ఈ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరుతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.
ఈ విచారణలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే.. ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘అలాగే న్యాయవ్యవస్థ పాత్ర వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని ఎన్సీఈఆర్టీ కేటాయించింది. కానీ కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం వదిలేసింది. జవాబుదారీతనం ఏర్పడేవరకు ఈ వ్యవహారాన్ని మేం వదిలివేయబోం. దీనికి వెనక ఎవరు ఉన్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ