
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్
అవెన్యూ కోర్టు తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు క్లీన్చిట్ ఇస్తూ సీబీఐ (CBI) నమోదు చేసిన కేసును డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పుపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఆ కేసును పెట్టారని ఆరోపించారు. కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి తాను రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని చెప్పానని.. ఆ విషయం తాజాగా కోర్టు తీర్పుతో స్పష్టమైందని అన్నారు. అన్యాయంగా తనను ఐదున్నర నెలల పాటు జైలులో పెట్టి కుటుంబానికి దూరం చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ కేసు పొలిటికల్ కోణంలో పెట్టిందని అనాడే.. కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. తనపై ఇన్నాళ్లు దుష్ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ కవిత ఆగ్రహంతో ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు