
ఢిల్లీ 27 ఫిబ్రవరి (హి.స.)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సీబీఐ (CBI) నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తిస్థాయిలో క్లీన్చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుబ్చిబాబు, సీఎం కేజీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, చార్జ్ షీట్లో అనే లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సీబీఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా, కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో కవితకు, బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.
కేసు నేపథ్యం ఇదే..
2021-22 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని(New Excise Policy) ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక కూడా ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా పాలసీని రూపొందించారని, దానికి ప్రతిఫలంగా ఆప్ (AAP) నాయకులకు రూ. కోట్ల ముడుపులు (Kickbacks) అందాయని సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ స్కామ్లో 'సౌత్ గ్రూప్' పేరుతో కొందరు వ్యాపారులు, కల్వకుంట్ల కవిత లాంటి రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని, సుమారు రూ.100 కోట్ల వరకు ముడుపులు చెల్లించారని సీబీఐ (CBI) తప దర్యాప్తులో తేల్చి నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి ఫిబ్రవరి 26న ఆప్ మంత్రి మనీష్ సిసోడియా, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవిత, మార్చి 21న సీఎం హోదాలో ఉన్న సీఎం అరవింత్ కేజీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారంతా ఒక్కొక్కరుగా బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ కేసుపై తుది విచారణ చేపట్టి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్ షీట్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..