
నిజామాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీ.సీ హాల్ లో శుక్రవారం వారు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై, నగర ప్రగతిపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల వారీగా మంజూరైన పనుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగింది తదితర వివరాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు డివిజన్లలో సీ.సీ, బీ.టీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, రోడ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉండగా, వాటిని వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా దాహార్తి సమస్య నెలకొనకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమృత్ పథకం కింద కొత్తగా 18 మంచి నీటి ట్యాంకులకు గాను 14 ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, మిగితా నాలుగు ట్యాంకుల పనులను కూడా త్వరగా
జరిపించాలని అన్నారు.
వేసవిలో దాహార్తి సమస్య తలెత్తకూడదు..
అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ విస్తరణ, భూగర్భడ్రైనేజీ పనులను కూడా వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మహాప్రస్థానం ఆకృతిలో స్మశాన వాటికను నిర్మించాలని, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలను పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు