
దిల్లీ 27 ఫిబ్రవరి (హి.స.)భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) ఖరారైన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడినట్లు ఇటీవల భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా గురువారం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) భారత్ను సందర్శించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, టారిఫ్లపై ఆయన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో చర్చలు జరిపారు. ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అమెరికా మంత్రి అనూహ్యంగా భారత్ను సందర్శించడంతో ట్రేడ్ డీల్లో మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా- భారత్ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాన్ని మరింతగా పెంచుకునే మార్గాలపై చర్చలు జరిపినట్లు అమెరికా వాణిజ్యశాఖ వెల్లడించింది. పీయూష్ గోయల్తో జరిపిన ఈ సమావేశాన్ని అత్యంత ఉత్పాదకమైన చర్చలుగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) పేర్కొన్నారు. భారత్-అమెరికా బంధాన్ని విస్తరించేందుకు ఫలవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ తెలిపారు.
‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈఈపీఏ)ను ఉపయోగించి ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్లు విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో భారత్ చేసుకొన్న ట్రేడ్ డీల్ (US-India Trade Deal)లో మార్పులు జరగనున్నాయి. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి రాగానే అన్ని దేశాలతో పాటు భారత్ పైనా 25శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25శాతం అదనపు టారిఫ్లు వేశారు. దీంతో మన దేశంపై మొత్తం టారిఫ్లు 50శాతానికి పెరిగాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య సుదీర్ఘంగా వాణిజ్య చర్చలు జరిగాయి.
3
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ