
ఆసిఫాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
చేతికొచ్చిన కందిపంటను
అమ్ముకుందామని భావిస్తున్న రైతులకు మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి రాకముందు మంచి ధర ఉండగా.. తీరా మార్కెట్లో అమ్మకం చేయాలనుకుంటే గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో రైతులు ఈ ఏడాది కూడా అప్పుల నుంచి బయటపడేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట మార్కెట్లో కందికి 8 నుంచి 9 వేల వరకు ధర ఉండగా..! ప్రస్తుతం మార్కెట్లో మాత్రం 700 నుంచి 7200 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి అధిక వర్షాలు మొంథా తుఫాను నేపథ్యంలో కంది పంట పూత, పీందే సమయంలో కొంతమేర పంట దెబ్బతింది. దీంతో కంది దిగుబడి కూడా ఆశించిన మేర వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని చాలా మండలాల్లో కంది కొనుగోలు కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేయక పోవడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. గిట్టుబాటు ధర కాకున్నా.. అవసరాల కోసం విక్రయించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధర తగ్గించి కంది కొనుగోలు జరుపుతుండటం తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మంచి రకం కంది కూడా నాణ్యత లేదనే సాకుతో తక్కువ ధరనే చెల్లిస్తున్నారని రైతులు
వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు