
కదిరి 28 ఫిబ్రవరి (హి.స.), భగవంతుని సేవ.. మరింత చేరువయ్యేలా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి దర్శనం, కేశఖండన, అభిషేకం, అర్చన, నివేదన, లడ్డూ ప్రసాదం, తులాభారం, నామకరణం, వాహనపూజ వంటి ఆర్జిత సేవా టికెట్లను పొందే యంత్రాలను ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, యశోదాదేవి దంపతులు ఆర్జిత సేవా టికెట్ల కియోస్క్ యంత్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టికెట్ల కోసం వరుసలో గంటలపాటు ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. సులభంగా సేవలు పొందేందుకు మూడు యంత్రాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఫోన్పేతో తగిన సేవలను ఎంచుకుని టికెట్ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ