
న్యూఢిల్లీ, 21 మార్చి (హి.స.)
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికి వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది. అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. చమురు, గ్యాస్ కొరతతో ఇండియాలో కూడా సంక్షోభం నెలకొంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బ తింటుందని, వరల్డ్ సప్లై చైన్‌కు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రశంసించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు