
దిల్లీ: , 23 మార్చి (హి.స.)భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో బొగ్గు వాయువీకరణ (గ్యాసిఫికేషన్) కీలకం కానుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం దిల్లీలోని యశోభూమిలో జరిగిన భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కీలకోపన్యాసం చేశారు. ‘‘దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. దాదాపు 74% విద్యుత్తు.. బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోంది. 2047 నాటికి బొగ్గు డిమాండ్ 1.7 బిలియన్ టన్నులకు చేరనుంది. మరోవైపు భారతదేశం తన అవసరాల కోసం ముడిచమురులో 83%, సహజవాయువులో 50%, మిథనాల్, ఎరువుల్లో 90%కి పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ధరల్లో మార్పుల కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బొగ్గును వాయువుగా మార్చడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టి దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయొచ్చు. 2030 నాటికి 100 బిలియన్ టన్నుల మేర బొగ్గు వాయువీకరణ పూర్తి చేయాలనే సంకల్పంతో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ప్రారంభించాం. ఇందుకోసం రూ.8,500 కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తెచ్చాం. బొగ్గును వినియోగంలోకి తీసుకురావడం కోసం భూగర్భ బొగ్గు వాయువీకరణ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనితో దిగుమతులపై ఆధార పడటం తగ్గి పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతుంది’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ