
ఢిల్లీ, 23 మార్చి (హి.స.)జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను (Digital Vouchers) కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో మాత్రమే ఈ ఉచిత ప్రసార అవకాశం ఉంటుంది. త్వరలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఉచిత ప్రసార అవకాశం కల్పించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 39ఏ సెక్షన్ కింద రాజకీయ పార్టీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఈసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఐటీ ఫ్లాట్ఫాం ద్వారా ఈ డిజిటల్ టైమ్ వోచర్లు జారీ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ బ్రాడ్కాస్ట్ విండో అభ్యర్థుల జాబితా విడుదలైన తేదీ నుంచి ప్రారంభమై పోలింగ్కు రెండ్రోజుల ముందు వరకూ కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్ర/యూటీ స్థాయిలో పారదర్శకంగా డ్రా నిర్వహించడం ద్వారా బ్రాడ్కాస్ట్ స్లాట్లు నిర్ధారిస్తారు. ప్రతి పార్టీకి దూరదర్శన్, అల్ ఇండియా రేడియాలో 45 నిమిషాల ఉచిత ప్రసార సమయం కేటాయిస్తారు. గత అసెంబ్లీ సమయంలో పార్టీల పనితీరు ఆధారంగా కూడా అదనపు ప్రసార సమయం కేటాయించే వీలుంటుంది. సాంకేతిక, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ట్రాన్స్క్రిప్టులు, రికార్డింగ్లను ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను సమష్టిగా వ్యక్తం చేసేందుకు వీలుగా ప్రసార భారతి ప్యానల్ డిస్కషన్లు, డిబేట్లను కూడా నిర్వహిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ