
అమరావతి, 22 మార్చి (హి.స.)
దిల్లీ: హోటళ్ల నిర్వాహకులకు గ్యాస్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. దేశీయంగా ఉత్పత్తి పెరిగినందున, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపును శనివారం మరో 20% పెంచడమే ఇందుకు కారణం. దీంతో మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరినట్లయ్యింది. పశ్చిమాసియాలో 3 వారాల నుంచి జరుగుతున్న యుద్ధం వల్ల, మన దేశానికి ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు ఇబ్బంది లేకుండా చూసేందుకు, వాణిజ్య సంస్థలకు ఎల్పీజీ సరఫరాలను మొదట్లో దాదాపుగా నిలిపివేశారు. ఆ తర్వాత, సరఫరాలలో అయిదో వంతు (20%) పునరుద్ధరించారు.
రాష్ట్రాలు పైపుల ద్వారా ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే షరతులకు లోబడి, మరో 10% సరఫరా పెంచడంతో, వాణిజ్య ఎల్పీజీ సరఫరా 30 శాతానికి చేరింది. గ్యాస్ ఉత్పత్తి మెరుగుపడినందున.. రెస్టారెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్లు, రాయితీ ఆహార కేంద్రాల వంటి కీలక రంగాలకు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును ఇంకో 20% పెంచుతున్నట్లు శనివారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరింది. ఇందువల్ల వలస కార్మికులకు ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ